'మా' ఎన్నికలు.. కుమారుడు విష్ణు కోసం రంగంలోకి దిగిన మోహన్ బాబు

22-06-2021 Tue 11:33
  • 'మా' అధ్యక్షుడి రేసులో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు
  • సూపర్ స్టార్ కృష్ణను కలిసిన మోహన్ బాబు
  • విష్ణుకు మద్దతు ఇవ్వాలని కోరిన వైనం
Mohanbabu seeks Super Star Krishnas support for Manchu Vishnu in MAA elections

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా వెలువడనప్పటికీ.. ఇప్పటికే సందడి నెలకొంది. 'మా' అధ్యక్షుడి రేసులో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు ఉన్నారు. వీరిద్దరికీ కూడా సినీ రంగంలో పరిచయాలు, సాన్నిహిత్యాలు ఎక్కువగా ఉండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

మరోవైపు తన కుమారుడు మంచు విష్ణు కోసం మోహన్ బాబు సైతం రంగంలోకి దిగారు. సూపర్ స్టార్ కృష్ణను ఈరోజు ఆయన కలిశారు. కృష్ణ నివాసానికి విష్ణుతో కలిసి మోహన్ బాబు వెళ్లారు. విష్ణుకు మద్దతును ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన కోరినట్టు సమాచారం. కృష్ణతో కలిసి మోహన్ బాబు, విష్ణు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, వీరి సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు.

'మా' ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెగా కుటుంబం మద్దతిచ్చే వారు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిరంజీవితో మోహన్ బాబుకు మంచి స్నేహం ఉంది. దీంతో, విష్ణును చిరంజీవి సపోర్ట్ చేసే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్. బాలకృష్ణతో కూడా మోహన్ బాబుకు మంచి అనుబంధం ఉంది. మరోవైపు చిరంజీవితో ప్రకాశ్ రాజ్ కు కూడా సాన్నిహిత్యం ఉంది. చిరంజీవి మద్దతు తనకు పలుకుతారనే ఆశాభావంలో ఆయన కూడా ఉన్నారు.