వ్యాక్సిన్లు ఇప్పిస్తామంటూ.. నిర్మాత సురేశ్ బాబుకు టోకరా వేసిన కేటుగాడు!

22-06-2021 Tue 10:57
  • 500 డోసుల టీకాలు ఉన్నాయంటూ మోసం
  • రూ.ల‌క్ష‌ తీసుకుని మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్  
  • నిందితుడు నాగార్జున రెడ్డి అరెస్టు
man cheats suresh babu

క‌రోనా విజృంభ‌ణ వేళ వ్యాక్సిన్ల కొర‌త ఉన్న నేప‌థ్యంలో ఇదే అదనుగా చేసుకుని కొంద‌రు కేటుగాళ్లు మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. తాము వ్యాక్సిన్లు ఇప్పిస్తామ‌ని చెబుతూ డ‌బ్బులు తీసుకుని ఆ త‌ర్వాత మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నారు. చివ‌ర‌కు వారి బారిన‌ ప్రముఖ సినీ నిర్మాత సురేశ్ బాబు కూడా ప‌డ్డారంటే ప‌రిస్థితి ఎలా ఉందో ఊహించుకోవ‌చ్చు.

త‌మ వ‌ద్ద‌ 500 డోసుల టీకాలు ఉన్నాయని సురేశ్ బాబుకు నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి, తన భార్య బ్యాంకు ఖాతాకు రూ.లక్ష బదిలీ చేయాలని చెప్పాడు. దీంతో అతడి మాటలు నమ్మిన సురేశ్ బాబు తన మేనేజరుకు చెప్పి రూ.లక్ష బదిలీ చేయించారు. ఆ డ‌బ్బు తీసుకున్న అనంత‌రం నాగార్జున రెడ్డి త‌న‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు.

దీంతో అత‌డిపై జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో సురేశ్ బాబు సిబ్బంది ఫిర్యాదు చేశారు. కాగా, నాగార్జున రెడ్డిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్ప‌టికే అరెస్టు చేసి, చేస్తోన్న మోసాల‌న్నింటినీ గుర్తించారు. ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ ప్రతినిధిని కూడా అత‌డు టీకాల పేరుతో మోసగించిన‌ట్లు చెప్పారు. తాను మంత్రి కేటీఆర్‌ పీఏనని చెప్పుకుంటూ అత‌డు ఈ మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు పోలీసులు తేల్చారు.