కరోనా టీకాల వల్ల సంతానోత్పత్తి సమస్యలు ఉండవు.. స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

21-06-2021 Mon 22:45
  • పురుషులు, మహిళలు ఎవరిలోనూ సమస్యలుండవు
  • అందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు
  • అవన్నీ అపోహలు, వదంతులే
  • అన్ని పరీక్షలు నిర్ధారించిన తర్వాతే వినియోగం
  • పాలిచ్చే తల్లులూ టీకా తీసుకోవచ్చు
No infertility problems due to corona vaccine Centre clarifies

కరోనా టీకాల వల్ల పురుషుల్లోగానీ, మహిళల్లోగానీ సంతానోత్పత్తి సమస్యలు తలెత్తున్నట్లు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆందోళన వ్యక్తమవుతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తుచేసింది. పోలియో, మీజిల్స్‌, రుబెల్స్‌ వంటి టీకాలు అందుబాటులోకి వచ్చిన సమయంలోనూ ఇదే తరహా అపోహలు, వదంతులు వ్యాప్తి చెందాయని తెలిపింది.

వ్యాక్సిన్ల ప్రభావంపై తొలుత జంతువులు, ఆ తర్వాత మనుషులపై పరీక్షించారని కేంద్రం గుర్తు చేసింది. ఎలాంటి దుష్ప్రభావాలు లేవని నిర్ధారణ అయ్యిందని తెలిపింది. వ్యాక్సిన్లు భద్రమైనవి, సురక్షితమైనవి అని నిర్ధారణ అయిన తర్వాతే వాటి వినియోగాన్ని ప్రారంభించారని పేర్కొంది. పాలిచ్చే తల్లులు సైతం టీకా తీసుకోవచ్చని ‘నేషనల్‌ ఎక్సపర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌’ స్పష్టం చేసింది.