బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్... విశాఖ తీరప్రాంత అభివృద్ధికి కొత్త సంస్థ

21-06-2021 Mon 22:00
  • విశాఖ-భీమిలి-భోగాపురం బీచ్ రోడ్ అభివృద్ధికి ప్రణాళిక
  • రిసార్టులు, గోల్ఫ్ కోర్టులు నిర్మాణం
  • 570 ఎకరాల్లో అభివృద్ధి
  • అంచనా వ్యయం రూ.1,021 కోట్లు
Govt decides to establish Beach Road Corridor Corporation for Visakha beach road development

రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించిన ఏపీ సర్కారు... నగరాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. తాజాగా విశాఖ టూరిజం అభివృద్ధి కోసం కొత్తగా 'బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్' ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ కారిడార్ లో భాగంగా బీచ్ రోడ్ లో రిసార్టులు, కైలాసగిరి వద్ద ఫ్లోటింగ్ రెస్టారెంట్, గోల్ఫ్ కోర్టులు నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,021 కోట్లు. విశాఖ-భీమిలి-భోగాపురం బీచ్ రోడ్ లో 570 ఎకరాల్లో ఈ కారిడార్ ఏర్పాటు చేస్తారు. విశాఖ తీరప్రాంత టూరిజం, వాణిజ్య, మౌలిక సదుపాయాల కల్పన ఈ బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్ ప్రధాన విధి.

కాగా, విశాఖపట్నం నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి రూ.5,174 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్టు కొన్నిరోజుల కిందట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.