E-commerce: ఈ-కామర్స్‌ మోసాలకు కేంద్రం ముకుతాడు.. కఠిన నిబంధనల రూపకల్పన!

  • ఫ్లాష్‌ సేల్స్‌పై నిషేధం
  • ఉత్పత్తులకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఉంచాలి
  • ఈ-కామర్స్‌ సంస్థలకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి
  • వినియోగదారుడికి వస్తువు చేరకపోతే ఈ-కామర్స్‌ సంస్థదే బాధ్యత
  • వివాద పరిష్కారానికి కంప్లయన్స్‌ ఆఫీసర్‌ నియామకం
  • మార్పులను ప్రతిపాదించిన కేంద్రం
Ban on flash sale centre propose stringent rules to end online cheating

ఈ-కామర్స్‌ వేదికలపై చేస్తున్న ఆన్‌లైన్‌ షాపింగ్‌లో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల రక్షణ(ఈ-కామర్స్‌) నిబంధనలు, 2020లో పలు సవరణలు ప్రతిపాదిస్తూ వాటిపై అభిప్రాయప సేకరణ ప్రారంభించింది.

కొత్త నిబంధనల ప్రకారం.. మోసాలకు ప్రధాన కేంద్రంగా ‘ఫ్లాష్‌ సేల్‌’ విధానాన్ని పూర్తిగా నిషేధించాలని కేంద్రం ప్రతిపాదించింది. అలాగే ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తులకు ఈ-కామర్స్‌ వేదికలపై ప్రత్యేక గుర్తింపు ఉండకూడదని సూచించింది. అలాగే ఈ-కామర్స్‌ సంస్థలన్నింటికీ ‘డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ)’ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది.

అలాగే వివాద పరిష్కారానికి ఒక చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్‌ను నియమించాలని ప్రతి ఈ-కామర్స్‌ సంస్థను ఆదేశించనున్నట్లు కేంద్రం తెలిపింది. దిగుమతి చేసుకున్న వస్తువులైతే.. తయారైన దేశం వంటి అన్ని వివరాలు ఉత్పత్తిపై ఉండాలని ప్రతిపాదించింది. అలాగే ఏ ఒక్క సర్వీస్‌ ప్రొవైడర్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వొద్దని స్పష్టం చేసింది.

ఇక ఈ-కామర్స్‌ సంస్థలు సేకరించిన వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేయకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా వస్తువు వినియోగదారుడికి చేరకపోతే ఈ-కామర్స్‌ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధనల్ని అఖిల భారత వర్తకుల సమాఖ్య(సీఏఐటీ) సైతం స్వాగతించడం విశేషం.

More Telugu News