రిపబ్లిక్‌ డబ్బింగ్‌ ప్రారంభించిన సాయి ధరమ్ తేజ్‌!

21-06-2021 Mon 19:53
  • దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్‌
  • సాయి తేజ్‌ సరసన ఐశ్వర్య రాజేశ్‌
  • జూన్‌ 4న విడుదల కావాల్సిన సినిమా  
  • లాక్‌డౌన్‌ వల్ల ఆగిపోయిన విడుదల
  • నేడు డబ్బింగ్‌ ప్రారంభించిన హీరో
Sai Dhram Tej Started republic Dubbing

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తున్న ‘రిపబ్లిక్‌’ చిత్రం ముందు నిర్ణయించినట్లుగా జూన్‌ 4న విడుదల కావాల్సింది. కానీ, కరోనా మహమ్మారి మూలంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అనుకున్న తేదీకి విడుదల చేయడం సాధ్యం కాలేదు. అయితే, నేటి నుంచి తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో తిరిగి చిత్రానికి సంబంధించిన పనులు ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు డబ్బింగ్‌ చెప్పినట్లు సాయి ధరమ్‌ తేజ్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించాడు.

షూటింగ్‌ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. మహమ్మారి మూలంగా రిపబ్లిక్‌ విడుదలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే, ఓ దశలో చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్‌ చేస్తారన్న చర్చ కూడా జరిగింది. కానీ, పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో విడుదలపై చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది వేచి చూడాల్సి ఉంది.

ఆటోనగర్‌ సూర్య, ప్రస్థానం వంటి హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన దేవ కట్టా ఈ సినిమాను తెరకెక్కించారు. సాయి ధరమ్‌ తేజ్‌ సరసన ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర్‌ నటి రమ్యకృష్ణ సైతం ప్రముఖ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.