కరోనా బాధిత దేశాల అథ్లెట్లకు కఠిన నిబంధనలు... అసంతృప్తి వ్యక్తం చేసిన భారత ఒలింపిక్ సంఘం

21-06-2021 Mon 19:38
  • వచ్చే నెలలో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం
  • 11 దేశాల అథ్లెట్లపై కఠిన ఆంక్షలు
  • వారంపాటు ప్రతిరోజు కరోనా టెస్టులు
  • జపాన్ వచ్చాక మూడ్రోజుల పాటు క్వారంటైన్
  • తీవ్ర అనైతికమన్న భారత ఒలింపిక్ సంఘం
Tokyo Olympics organizers imposes stricter rules for athletes from corona hit countries

వచ్చే నెలలో జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. అయితే, కరోనా ప్రభావం అధికంగా ఉన్న 11 దేశాల నుంచి వచ్చే అథ్లెట్లకు జపాన్ ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ఆయా దేశాల క్రీడాకారులు జపాన్ బయల్దేరడానికి ముందు వారం రోజుల పాటు నిత్యం కరోనా టెస్టులు చేయించుకోవాలని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు స్పష్టం చేశారు.

 వారు జపాన్ చేరుకున్న తర్వాత మూడు రోజుల పాటు ఇతర దేశాల జట్లతో కలవకుండా ఉండాలని పేర్కొన్నారు. తద్వారా ఒలింపిక్స్ క్రీడల్లో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని భావిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా, భారత్ వంటి దేశాల్లో కరోనా వేరియంట్ల కారణంగా గణనీయమైన నష్టం జరిగిందని వెల్లడించారు.

అయితే, టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ వంటి దేశాల అథ్లెట్లపై ఆంక్షలు విధించడం తీవ్ర అనైతికం అని విమర్శించింది. ఈ నిబంధనల కారణంగా అథ్లెట్లు మూడు రోజుల పాటు కీలకమైన శిక్షణకు దూరమవ్వాల్సి వస్తుందని వెల్లడించింది. దీనిపై ఐఓఏ అధ్యక్షుడు నరిందర్ బాత్రా, కార్యదర్శి రాజీవ్ మెహతా సంయుక్త ప్రకటన చేశారు.

అథ్లెట్లు తమ ఈవెంట్ ప్రారంభానికి కేవలం ఐదు రోజుల ముందు ఒలింపిక్ క్రీడాగ్రామంలోకి ప్రవేశిస్తారని, కొత్త నిబంధనల నేపథ్యంలో మూడు రోజులు వృథా అని తెలిపారు. భారత క్రీడాకారులు ఒలింపిక్స్ కోసం ఐదేళ్లు కఠోరంగా శ్రమించారని, భారత క్రీడాకారులకు కూడా వర్తించేలా టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు నిబంధనలు తీసుకురావడం సరికాదని అభిప్రాయపడ్డారు.

కాగా, టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు నిబంధనలు వర్తింపజేస్తున్న దేశాల్లో భారత్ తో పాటు పాకిస్థాన్, బ్రిటన్ కూడా ఉన్నాయి.