టబు పాత్రలో మనీషా కొయిరాలా!

21-06-2021 Mon 18:15
  • హిందీ రీమేక్ గా 'అల వైకుంఠపురములో'
  • జంటగా కార్తీక్ ఆర్యన్ .. కృతి సనన్
  • దర్శకుడిగా రోహిత్ ధావన్
  • ముఖ్యపాత్రలో పరేష్ రావెల్  
 Manisha Koirala in Tabu character

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. దాంతో ఏక్తా కపూర్ తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. నాయకా నాయికలుగా కార్తీక్ ఆర్యన్ - కృతి సనన్ ను కొన్ని రోజుల క్రితమే ఖరారు చేశారు. తాజాగా ఒక కీలకమైన పాత్ర కోసం మనీషా కొయిరాలాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

తెలుగులో టబు చేసిన పాత్రను హిందీలో మనీషా కొయిరాలా చేయనుందని అంటున్నారు. ఇక తెలుగులో టబు తండ్రి పాత్రను పోషించిన సచిన్ కేద్కర్ స్థానంలో పరేష్ రావెల్ ను ఎంపిక చేసుకున్నారు. ఇతర తారాగణం ఎంపిక ప్రక్రియ కొనసాగుతూనే ఉందట. ఈ సినిమాకి 'యువరాజు' అనే అర్థం వచ్చేలా 'షెహ్ జాదా' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, అక్కడ ఏ స్థాయి సంచలనానికి తెరతీస్తుందో చూడాలి.