లోకేశ్ కు జూనియర్ ఎన్టీఆర్ భయం పట్టుకుంది: మంత్రి పేర్ని నాని

21-06-2021 Mon 18:14
  • మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్
  • లోకేశ్ పై తీవ్రస్థాయిలో ధ్వజం
  • నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం
  • తాము కూడా తిట్టగలమని హెచ్చరిక
Perni Nani comments on Nara Lokesh

ఏపీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ ఇప్పుడు సొంత పార్టీలోనే ఉనికి కోసం తాపత్రయపడుతున్నాడని విమర్శించారు. లోకేశ్ కు జూనియర్ ఎన్టీఆర్ భయం పట్టుకుందని వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ రావాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటుండడమే అందుకు కారణమని తెలిపారు.

 కార్యకర్తలు "రావాలి జూనియర్ ఎన్టీఆర్, కావాలి జూనియర్ ఎన్టీఆర్" అంటుండడంతో... "జూనియర్ ఎన్టీఆర్ అక్కర్లేదు నేనే సరిపోతాను" అంటూ జగన్ మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అసభ్యంగా, విచక్షణ లేకుండా ఏరా, ఒరే అని మాట్లాడుతున్నాడని, తాము కూడా మాట తూలగలం అని పేర్ని నాని హెచ్చరించారు.

అయినా గడ్డం పెంచినవాడల్లా గబ్బర్ సింగ్ కాలేడని లోకేశ్ ను ఎద్దేవా చేశారు. చివరికి అమ్మాయిలపై అఘాయిత్యం జరిగినా రాజకీయం చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. లోకేశ్ ఉద్యోగం పోయిన రాజకీయ నిరుద్యోగి అని వ్యంగ్యం ప్రదర్శించారు. లోకేశ్ ప్రస్తుతం తీవ్ర అసహనంలో ఉన్నారని, చూస్తుంటే సానుభూతి కలుగుతోందని వ్యాఖ్యానించారు.