మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతున్న సమంత!

21-06-2021 Mon 18:11
  • రెండు చేతులా సంపాదిస్తున్న సమంత 
  • వ్యాపారంలో కూడా రాణిస్తున్న ముద్దుగుమ్మ
  • ఇప్పటికే 'సాకీ' ఫ్యాషన్ వరల్డ్.. 'ఏకమ్' ప్రీ స్కూల్
  • కొత్తగా జ్యువెలరీ వ్యాపారంలోకి దిగుతున్న సమంత      
Samantha starts new business soon

ఇప్పటి కథానాయికలు చాలా తెలివిగా వుంటున్నారు. ముఖ్యంగా సంపాదన.. తద్వారా వచ్చిన మొత్తాన్ని వేరే చోట పెట్టుబడి పెట్టడంపై బాగా దృష్టి పెడుతున్నారు. సినిమాలు.. వెబ్ సీరీస్.. బ్రాండింగ్.. కొత్త షాపుల ఓపెనింగులు ... ఇలా ఎన్నో రకాలుగా నేటి తారలు రెండు చేతులా సంపాదిస్తున్నారు. వీరిలో చాలామంది రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు.

అక్కినేని వారి కోడలు సమంత అయితే, సంపాదనలోనూ.. పెట్టుబడుల విషయంలోనూ అందరికంటే ముందే వుంది. సినిమాలు, వెబ్ సీరిస్, వాణిజ్య ప్రకటనల ద్వారా బాగానే సంపాదిస్తోంది. అలాగే, తెలివిగా వ్యాపారాల్లో ఇన్వెస్ట్ మెంట్స్ కూడా చేస్తోంది. ఆమధ్య 'సాకీ' పేరిట ఫ్యాషన్ వరల్డ్ ను ప్రారంభించిన సమంత.. మొన్నీమధ్య 'ఏకమ్' పేరుతో ఓ ప్రీ స్కూలును కూడా స్టార్ట్ చేసింది.

ఇక ఇప్పుడు కొత్తగా జ్యువెలరీ వ్యాపారంలోకి కూడా ఈ ముద్దుగుమ్మ దిగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయట. మొత్తానికి ఈ చిన్నది రకరకాల వ్యాపారాల్లోకి అడుగుపెడుతూ, వ్యాపారవేత్తగా కూడా బిజీ అవుతోందన్న మాట.