సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడటం దారుణం: బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు

21-06-2021 Mon 18:05
  • గజ్వేల్ ఎమ్మెల్యేను దుబ్బాక ఎమ్మెల్యే కూడా తిట్టగలడు
  • సంపన్నులకు రైతుబంధు పథకం అవసరమా?
  • ధాన్యం కొనుగోలులో కేసీఆర్ ఒక కమిషన్ ఏజెంట్
Raghunandan Rao fires on KCT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడటం దారుణమని అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే (కేసీఆర్)ను దుబ్బాక ఎమ్మెల్యే కూడా తిట్టగలడని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి పాలైందని... ఆ భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటనకు బయల్దేరుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పీఠాలు కదులుతున్నాయనే విషయం కేసీఆర్ కు స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు.

రైతుబంధు పథకం, రైతు వేదికలు, వైకుంఠధామాలను విపక్షాలు వ్యతిరేకించడం లేదని... అయినప్పటికీ కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని రఘునందన్ అన్నారు. సర్పంచ్ లు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న దారుణ ఘటనలు కేసీఆర్ హయాంలోనే ప్రారంభమయ్యాయని చెప్పారు. సంపన్నులకు కూడా రైతుబంధు ఇవ్వడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణలో ఇప్పటికే పంజాబ్ తొలి స్థానంలో ఉందని... ఈ విషయంలో కేసీఆర్ అబద్ధాలు చెపుతున్నారని అన్నారు. కేసీఆర్ చెపుతున్నట్టు తెలంగాణ మొదటి స్థానంలో లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో కేసీఆర్ ఒక కమిషన్ ఏజెంట్ అని ఎద్దేవా చేశారు.