ఆనందయ్య చుక్కల మందులో హానికర పదార్థం... కోర్టుకు తెలిపిన ప్రభుత్వం

21-06-2021 Mon 17:33
  • ఇటీవల ఆనందయ్య కరోనా మందుకు అనుమతి
  • చుక్కల మందుకు అనుమతి నిరాకరణ
  • చుక్కల మందుపై అధ్యయనం
  • నివేదికలు సమర్పించాలన్న కోర్టు
  • తదుపరి విచారణ జులై 1కి వాయిదా
Govt tells court harmful substance in Anandaiah eye drops

ఇటీవల ఆనందయ్య కరోనా మందుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, కంట్లో వేసే చుక్కల మందుకు మాత్రం అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. ఆ మందుపై అధ్యయనం కొనసాగుతోందని నాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తాజాగా దీనిపై జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు ఆసక్తికర అంశం వెల్లడించారు.

ఆనందయ్య చుక్కల మందులో హానికర పదార్థం ఉందని తెలిపారు. ఈ పదార్థం కళ్లకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు చుక్కల మందును ఐదు ప్రయోగశాలల్లో పరీక్షించామని న్యాయవాది వివరించారు. అయితే ఆ ప్రయోగశాలలు రూపొందించిన నివేదికలు తమకు సమర్పించాలని కోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. అనంతరం విచారణను జులై 1కి వాయిదా వేసింది.

ఏపీ సర్కారుతో పాటు హైకోర్టు కూడా ఇటీవల ఆనందయ్య కరోనా మందుకు ఓకే చెప్పడంతో రాష్ట్రంలో పలు చోట్ల మందు పంపిణీ జరుగుతోంది. అయితే కంట్లో వేసే చుక్కల మందుపై మాత్రం స్పష్టత రాకపోవడంతో, ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆనందయ్య కుటుంబీకులు వేసే చుక్కల మందు కోసం తెలంగాణ నుంచి కూడా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వచ్చిన వారున్నారు.