West Bengal: బెంగాల్‌లో వ్యాక్సిన్ల కొరత.. కేవలం ప్రాధాన్య వర్గాలకే రేపటి నుంచి టీకా!

  • దేశవ్యాప్తంగా రేపు ప్రారంభం కానున్న సార్వత్రిక వ్యాక్సినేషన్ కార్యక్రమం
  • ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద రద్దీ కూడా తగ్గుదల
  • వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం
  • ప్రస్తుతం రోజుకి రెండు లక్షల మందికి టీకా
No universal vaccine in bengal from tomorrow

సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన సార్వత్రిక వ్యాక్సినేషన్‌ కార్యక్రమం బెంగాల్‌లో మొదలుకావడం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. టీకా డోసుల కొరత వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ సామూహికంగా టీకా ఇవ్వడం ఆపేసి కేవలం ప్రాధాన్య క్రమంలో ఉన్న వర్గాలకు మాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రకటించింది. దీని వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద రద్దీ కూడా తగ్గుతుందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.

రోజుకి ఐదు లక్షల మందికి టీకా ఇచ్చే వసతులు రాష్ట్రంలో ఉన్నాయని బెంగాల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. ఇప్పటికే రోజుకి రెండు లక్షల మందికి టీకా ఇస్తున్నామని తెలిపింది. దీన్ని త్వరలోనే మూడు లక్షలకు పెంచుతామని వెల్లడించింది. బెంగాల్‌లో ఇప్పటి వరకు 1,89,31,993 డోసులు పంపిణీ చేశారు. మొత్తం ఓటు హక్కు గల జనాభాలో ఇది 25.2 శాతం.

More Telugu News