తనకు కరోనా ఎలా వచ్చిందో కామెడీగా చెప్పిన సీఎం కేసీఆర్... వీడియో ఇదిగో!

20-06-2021 Sun 18:40
  • సిద్ధిపేటలో కేసీఆర్ ప్రసంగం
  • ఇటీవల ఓ పెళ్లికి వెళ్లినట్టు చెప్పిన కేసీఆర్
  • పెళ్లి కొడుకు మాస్కు తీయమన్నాడని వెల్లడి
  • ఫొటో కోసం అని చెప్పాడని వివరణ  
KCR explains how he got corona in a funny way

ఇటీవల కరోనా బారినపడిన తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్నిరోజుల్లోనే కోలుకున్నారు. సీఎంకు కరోనా పాజిటివ్ రావడం పట్ల చాలామంది ఆశ్చర్యపోయారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఆయనకు ఎలా వచ్చిందని అనుకున్నారు. అయితే, ఇవాళ సిద్ధిపేటలో జరిగిన ఓ సమావేశంలో కేసీఆర్ ఆసక్తికరంగా ప్రసంగిస్తూ, తనకు కరోనా ఎలా సోకిందో కామెడీగా వివరించారు.

"ఇటీవల ఓ పెళ్లికి వెళ్లాను, అక్కడ పెళ్లి కొడుకు మాస్కు తీసేయాలని కోరాడు. మాస్కు తీయడం ఎందుకని అడిగితే, మీరు మళ్లీ మాకు దొరకరు కదా సార్, అందుకే ఫొటో తీసుకుందామని మాస్కు తీయమన్నాం సార్ అని ఆ పెళ్లికొడుకు చెప్పాడు. నేను నీకు దొరకడం ఏమో కానీ, మాస్కు తీసేస్తే కరోనాకు నేను దొరుకుతా అని చెప్పా. ఆ విధంగా నా మాస్కును వాడు లాగి, వీడు లాగి చివరికి నాక్కూడా కరోనా వచ్చింది" అని అందరిలోనూ నవ్వులు పూయించారు.