AK Singhal: థర్డ్ వేవ్ లో పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందనేది నిజం కాకపోవచ్చు: ఏకే సింఘాల్

AK Singhal opines on third wave effect on children
  • ఏపీలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్
  • తిరుపతిలో పర్యటించిన ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి
  • ఒక్కరోజే 9 లక్షల డోసులు వేసేలా చర్యలు
  • రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షల మందికి తొలి డోసు
ఏపీలో ఇవాళ భారీ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి నెహ్రూనగర్ లో ఉన్న ఓ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని దర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటివరకు 96 లక్షల మందికి ఒక్క డోసు వేసినట్టు తెలిపారు.కొత్తగా వచ్చిన 9 లక్షల డోసులు ఒక్కరోజే వేసేలా నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ క్రమంలో నేడు ఇప్పటికే 5 లక్షల మందికి డోసులు వేశారని సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సామర్థ్యంపై కేంద్రానికి నివేదిక ఇస్తామని చెప్పారు.

థర్డ్ వేవ్ లో పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందనేది నిజం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. పిల్లలపై అధిక ప్రభావం అనే ఊహాగానాలను ఎయిమ్స్ నిపుణులు కొట్టిపారేస్తున్నారని అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. బెడ్లు, ఆక్సిజన్, ఔషధాలు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం 60 వేల యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లకు ఆర్డర్ పెట్టామని సింఘాల్ వెల్లడించారు.

ఇక, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. రోజువారీ కరోనా కేసుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోందని తెలిపారు. ఇక, తూర్పు గోదావరి జిల్లా మినహాయించి, ఇతర జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తున్నట్టు సింఘాల్ పేర్కొన్నారు. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఉంటుందని వివరించారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతి ఉంటుందని తెలిపారు.
AK Singhal
Thirdwave
Children
Corona Virus
Vaccination
Andhra Pradesh

More Telugu News