కాంగ్రెస్​ ఎమ్మెల్యేల కుమారులకు ప్రభుత్వ ఉద్యోగం.. పంజాబ్​ సీఎం అమరీందర్​ పై సొంత పార్టీ నేతల మండిపాటు

20-06-2021 Sun 14:43
  • వెనక్కు తీసుకోవాలని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డిమాండ్
  • మరో ఇద్దరు ఎమ్మెల్యేల అసహనం
  • వెనక్కు తీసుకునేది లేదన్న సీఎం
  • వారి కుటుంబాల త్యాగాల చిరు కానుకని కామెంట్
Punjab CM Offers Jobs to Cong MLAs Faces Dissent From Own Party

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుమారులకు పంజాబ్ అమరీందర్ సర్కారు.. ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. దానికి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. అయితే, దానిపై సొంత పార్టీ నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్ పీసీసీ చీఫ్ సునీల్ జఖార్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ చెత్త నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే, ప్రభుత్వం మాత్రం నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. వారి కుటుంబాలు చేసిన త్యాగాలకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుత్వం ఇస్తున్న ఓ చిన్న కానుక ఇది అని అంటోంది. శుక్రవారం ప్రతాప్ సింగ్ బాజ్వా, భిషం పాండే అనే ఇద్దరు ఎమ్మెల్యేల కుమారులకు ఉద్యోగాలిచ్చింది. ఒకరిని పోలీస్ ఇన్ స్పెక్టర్ గా, మరొకరిని నాయబ్ తహశీల్దార్ గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. వారి తాతలు ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురై ప్రాణ త్యాగం చేసినందుకే ఈ ఉద్యోగాలని ప్రభుత్వం అంటోంది.

‘‘వారికి ఉద్యోగాలిస్తూ మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేది లేదు. దీనికి కొందరు రాజకీయ రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం’’ అని సీఎం అమరీందర్ సింగ్ మండిపడ్డారు.