ఢిల్లీలో రేపటి నుంచి మరిన్ని సడలింపులు

20-06-2021 Sun 14:29
  • బార్లను ఓపెన్ చేసేందుకు అనుమతి
  • రెస్టారెంట్లకు మరో 4 గంటల అదనపు టైం
  • పార్కులు, గోల్ఫ్ క్లబ్బులు, యోగాకూ అనుమతి
Delhi Allows Bars To Open From Tomorrow

కరోనా కేసులు భారీగా తగ్గడంతో ఢిల్లీ ప్రభుత్వం ఇక అన్నింటినీ ఓపెన్ చేసేస్తోంది. ఇప్పటికే చాలా వరకు సడలింపులిచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మరిన్ని సడలింపులను ఇచ్చింది. సోమవారం (రేపటి) నుంచి బార్లు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే తెరుచుకున్న రెస్టారెంట్లకు మరో 4 గంటలు అదనపు సమయాన్ని ఇచ్చింది. పార్కులు, గార్డెన్లు, గోల్ఫ్ క్లబ్బులు, యోగా కార్యక్రమాలకూ అనుమతులను ఇచ్చింది.

మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు 50 శాతం సామర్థ్యంతో బార్లను తెరుచుకోవచ్చని పేర్కొంటూ తాజా ఉత్తర్వులను జారీ చేసింది. రెస్టారెంట్లను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచొచ్చని పేర్కొంది. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి అన్నింటినీ తెరిచేస్తే కేసులు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.