జగన్ ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాడాలి: 'సీపీఐ' రామకృష్ణ

20-06-2021 Sun 14:15
  • ప్రత్యేకహోదాపై ఇటీవల సీఎం జగన్ స్పందన
  • జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో రామకృష్ణ అసంతృప్తి
  • రెండేళ్ల తర్వాత జగన్ మాట మార్చారని వెల్లడి
  • ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్
Ramakrishna says Jagan should fight for special status

తాను ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్రం పెద్దల వద్ద ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నానని సీఎం జగన్ ఇటీవల చెప్పారు. అంతకుమించి ప్రత్యేకహోదాపై తాను చేయగలిగిందేమీ లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. సీఎం జగన్ ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం పోరాడాలని హితవు పలికారు.

25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా హోదాతో పాటు విభజన హామీలు సాధించుకు వస్తామని చెప్పారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత సీఎం జగన్ మాటమార్చుతున్నారని విమర్శించారు. ఎంపీలతో జగన్ రాజీనామా చేయించి ప్రత్యేకహోదాపై ఉద్యమించాలని అన్నారు. వైసీపీతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే దేశవ్యాప్తంగా అందరూ ప్రత్యేకహోదాపై చర్చిస్తారని, తద్వారా ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మోసం వెల్లడవుతుందని రామకృష్ణ వివరించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ మోసపోతూనే ఉందని పేర్కొన్నారు.