ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీకి చంద్ర‌బాబు నాయుడు లేఖ‌

20-06-2021 Sun 13:44
  • కొడవలూరు మండలానికి చెందిన మల్లికార్జున్‌పై దాడి
  • నెల్లూరు జిల్లా పైడేరు కాల్వలో ఇసుక‌ మాఫియాను ప్రశ్నించినందుకే దారుణం
  • కొడవలూరు పోలీసులు మల్లికార్జున్ పైనే తప్పుడు కేసు పెట్టారు
  • ఎస్సీ యువకుడిని వేధించేందుకు వైసీపీ పోలీసులు చేతులు కలిపారు
chandrababu writes letter to dgp

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీకి టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. కొడవలూరు మండలానికి చెందిన మల్లికార్జున్ అనే వ్య‌క్తిపై నలుగురు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆయ‌న చెప్పారు. నెల్లూరు జిల్లా పైడేరు కాల్వలో ఇసుక‌ మాఫియాను ప్రశ్నించినందుకే ఈ దారుణానికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న తెలిపారు. అంతేగాక‌, ఈ ఘ‌ట‌న‌పై  కొడవలూరు పోలీసులు మల్లికార్జున్ పైనే తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశార‌ని అన్నారు.

ఎస్సీ యువకుడిని వేధించేందుకు పోలీసులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపార‌ని ఆయ‌న ఆరోపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ లేని విధంగా పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించి నేరస్థులపై వెంటనే చర్యలు తీసుకుకోవాల‌ని డీజీపీని చంద్ర‌బాబు నాయుడు కోరారు. మల్లికార్జున్‌పై దాఖలైన తప్పుడు కేసులను తొలగించాలని ఆయ‌న అన్నారు.