Telangana: పెళ్లి పత్రికలో పేర్లు రాయించలేదని ఘర్షణ.. బంధువులపై కత్తితో దాడి

Man Stabs Relatives For not Being mentioned their names in wedding invitation
  • నలుగురికి తీవ్ర గాయాలు
  • ఇద్దరి పరిస్థితి విషమం
  • గాయాలతోనే పోలీసులకు ఫిర్యాదు
  • సికింద్రాబాద్ లో ఘటన
పెళ్లి పత్రికలో తమ పేర్లు లేవన్న కారణంతో బంధువులు మాటామాటా అనుకున్నారు. చినికిచినికి గాలివాన అయినట్టు అదికాస్తా పెద్ద ఘర్షణకు దారితీసింది. కత్తిపోట్ల వరకు వెళ్లింది. సికింద్రాబాద్ లోని చంద్రశేఖర్ నగర్ లో బంధువులపై ఓ వ్యక్తి తన సోదరుడితో కలిసి దాడి చేయడంతో నలుగురు గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిందితులు పరారయ్యారు.

మూడు రోజుల క్రితం సురేశ్ అనే వ్యక్తి వివాహం జరిగింది. అయితే, అతడి పెళ్లి ఆహ్వాన పత్రికలో తమ పేర్లు ఎందుకు కొట్టించలేదంటూ వారి బంధువు సర్వేశ్ అనే వ్యక్తి పెళ్లిరోజే గొడవపడ్డాడు. వారించిన సురేశ్ సోదరి బాలామణిని బూతులు తిట్టాడు. బంధువులు సర్ది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈరోజు ఉదయం బాలామణి కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకుని సర్వేశ్ ఇంటికి వెళ్లారు. అతడి సోదరుడు శేఖర్.. వారిపై రెచ్చిపోయాడు. ఆవేశంతో సర్వేశ్ కు తల్లి కత్తి ఇచ్చింది. అతడు ఆ కత్తితో బంధువులపై దాడి చేశాడు. అనంతరం అదే కత్తి తీసుకుని శేఖర్ కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఎస్. ప్రవీణ్ (30), నోముల పరశురాము (35), డి. యాదగిరి (42), ఎన్. ప్రతాప్ కుమార్ (32)లకు తీవ్రగాయాలయ్యాయి.

రక్తం కారుతున్నా గాయాలతోనే బాధితులు తుకారంగేట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితులను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్, పరశురాముల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
Telangana
Wedding
Crime News

More Telugu News