మాన్సాస్ ట్రస్ట్ తీర్పును వెల్లంపల్లి, విజయసాయి వక్రీకరిస్తున్నారు: టీడీపీ

20-06-2021 Sun 09:58
  • కోటిపల్లి మాన్సాస్ భూముల్లో ఇసుక రేవుకు అనుమతి ఇచ్చిన  సంచయితను అరెస్ట్ చేయండి
  •  సంచయిత 14 నెలలపాటు చైర్మన్‌గా ఉన్నా ఆడిట్ ఎందుకు నిర్వహించలేదు
  • విజయసాయి జైలుకెళ్లి రావడంతో పదేపదే అందరినీ జైలుకు పంపుతామని అంటున్నారు
TDP fires on Minister Vellampalli and Vijay Sai Reddy
ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, పొలిట్‌బ్యూరో సభ్యురాలు జి.సంధ్యారాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ.. మాన్సాస్ ట్రస్ట్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును వెల్లంపల్లి, విజయసాయి వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రస్టుపై ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామంటున్నారని,  సంచయిత ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి 14 నెలలు అయినా ఇప్పటి వరకు ఎందుకు ఆడిట్ నిర్వహించలేదని ప్రశ్నించారు.

కోటిపల్లి మాన్సాస్ భూముల్లో ఇసుక రేవుకు అనుమతి ఇచ్చేందుకు సంతకం పెట్టిన  సంచయితను అరెస్ట్ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. వేల ఎకరాలను దానంగా ఇచ్చిన వంశం నుంచి వచ్చిన అశోక్ గజపతిరాజు అక్రమాలకు పాల్పడ్డారంటే ప్రజలెవరూ నమ్మరని అన్నారు. రుజువుచేయలేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి జైలుకు వెళ్లి రావడంతో అందరినీ జైలుకు పంపుతామని పదేపదే బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు.