కర్ఫ్యూ వేళలను సడలించిన ఏపీ ప్రభుత్వం

19-06-2021 Sat 21:48
  • ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు
  • పూర్తి స్థాయిలో పని చేయనున్న కార్యాలయాలు
  • సాయంత్రం 5 గంటలకు మూత పడనున్న షాపులు
AP govt relaxes curfew timings

కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కర్ఫ్యూ వేళలను సడలిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కర్ఫ్యూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వేళలను 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూని అమలు చేయనున్నారు.

అయితే, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ప్రస్తుతం ఉన్న విధంగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం తెలిపింది. షాపులు, రెస్టారెంట్లు తదితరాలు సాయంత్రం 5 గంటలకే మూతపడనున్నాయి. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ పై ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కర్ఫ్యూ సడలింపుపై నిర్ణయం తీసుకున్నారు.