ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి చిట్టా తీశాం: బండి సంజ‌య్ వార్నింగ్

19-06-2021 Sat 20:52
  • సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుతాం
  • ఈటల రాజేందర్ జోలికి వ‌స్తే కేసీఆర్ గడీలు బద్దలు కొడతాం
  • గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేయడమే మా లక్ష్యం
  • ప్ర‌భుత్వ భూముల అమ్మ‌కం స‌రికాదు
bandi sanjay slams trs

తెలంగాణ ప్ర‌భుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మండిప‌డ్డారు. హుజూరాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్‌తో పాటు ప‌లువురు నేత‌ల‌తో కలిసి బండి సంజ‌య్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుతామని హెచ్చ‌రించారు.

ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి చిట్టా తీశామని ఆయ‌న చెప్పారు. ఈటల రాజేందర్ జోలికి వ‌స్తే కేసీఆర్ గడీలు బద్దలు కొడతామని హెచ్చరించారు. ఉద్యమకారులకు ఏకైక వేదిక బీజేపీనేనని, గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమని చెప్పారు. సర్పంచ్‌కి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారంటే, దానికి కార‌ణం ఈటల బీజేపీలో చేరడమేన‌ని ఆయ‌న అన్నారు.  

సీఎం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో గెలవలేరని అన్నారు. జైళ్ల‌ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, జైలు అంటే ఆయ‌న‌కు భయమ‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌భుత్వ భూముల అమ్మ‌కం స‌రికాద‌ని, పేద‌ల‌కు డబుల్ బెడ్‌రూమ్‌లకు, దళితులకు మూడు ఎక‌రాలు ఇవ్వ‌డానికి దొరకని భూములు అమ్ముకోవడానికి మాత్రం ఎలా దొరుకుతున్నాయ‌ని ఆయ‌న నిల‌దీశారు.