నా రాజకీయ జీవితంలో గొప్ప స్నేహితుడు రఘువీరారెడ్డి: చిరంజీవి

19-06-2021 Sat 20:50
  • పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఆయనతో అనుబంధం బలపడింది
  • రాయలసీమకు నీళ్లు ఇవ్వడం ఆయన దార్శనికతకు నిదర్శనం
  • నేను నటుడిగా కొనసాగుతుంటే.. ఆయన రైతుగా మారారు
Raghuveera Reddy is my best friend says Chiranjeevi

మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిపై సినీ నటుడు చిరంజీవి ప్రశంసలు కురిపించారు. అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో రఘువీరా నేతృత్వంలో కొత్తగా నిర్మిస్తున్న దేవాలయాలకు ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రఘువీరాకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. తన రాజకీయ జీవితంలో గొప్ప స్నేహితుడు రఘువీరా అని చెప్పారు. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఆయనతో తనకు బలమైన అనుబంధం ఏర్పడిందని తెలిపారు.

కరువుసీమకు నీళ్లు ఇవ్వాలనే కథాంశంతో తాను 'ఇంద్ర' సినిమాను తీశానని... ఆ సినిమా ప్రేరణతోనే రఘువీరా కరువుసీమకు నీళ్లు ఇచ్చారని, ఇది ఆయన రాజకీయ దార్శనికతకు నిదర్శనమని చిరంజీవి ప్రశంసించారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వడం, ఆ కార్యక్రమానికి తాను హాజరుకావడం తన భాగ్యమని అన్నారు. తాను మళ్లీ సినిమాలు చేస్తూ నటుడిగా కొనసాగుతుంటే... రఘువీరా రైతుగా మారారని చెప్పారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలను పునర్నిర్మిస్తున్నారని, కొత్త ఆలయాలను నిర్మిస్తున్నారని కొనియాడారు. రఘువీరాకు భగవంతుని ఆశీస్సులు, ప్రజల సహకారం ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.