అమెరికాలో సూర్యాపేట జిల్లా యువకుడు దుర్మరణం

19-06-2021 Sat 20:20
  • కోదాడకు చెందిన రవికుమార్ మృతి
  • బోటింగ్ చేస్తూ నీటిలో పడిపోయిన రవి
  • మృతి వార్తను తల్లిదండ్రులకు తెలిపిన మిత్రులు
Kodad man dead in USA

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సిరిపురపు రవికుమార్ అనే యువకుడు అమెరికాలో దుర్మరణం పాలయ్యాడు. రవికుమార్ వయసు 26 సంవత్సరాలు. గత మూడేళ్లుగా అమెరికాలోని ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. వీకెండ్ కావడంతో తన స్నేహితులతో కలసి బీచ్ లో బోటింగ్ కు వెళ్లాడు.

ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. రవికుమార్ చనిపోయినట్టు అతని తల్లిదండ్రులకు అమెరికాలో ఉంటున్న మిత్రులు తెలిపారు. ఈ వార్తతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తమ కన్నకొడుకును చివరిసారి చూసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి చదువులో రవి చాలా చురుకుగా ఉండేవాడని బంధువులు తెలిపారు.