మళ్లీ సెట్స్ పైకి వెళుతున్న 'మేజర్'

19-06-2021 Sat 18:46
  • అడివి శేష్ నుంచి 'మేజర్'
  • తెలుగు తెరకి సయీ మంజ్రేకర్ పరిచయం
  • కీలకమైన పాత్రలో రేవతి
  • వచ్చేనెలలో తదుపరి షెడ్యూల్  
Major shooting restarts from july
మొదటి నుంచి కూడా అడివి శేష్ విభిన్నమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అందువల్లనే అన్నివర్గాల ప్రేక్షకులు ఆయన సినిమాల పట్ల ఆసక్తిని చూపుతుంటారు. ఆయన తాజా చిత్రంగా 'మేజర్' రూపొందుతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. సోని పిక్చర్స్ తో కలిసి మహేశ్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కరోనా తీవ్రత పెరిగేవరకూ ఈ సినిమా సెట్స్ పైనే ఉంది. ఆ తరువాతనే షూటింగును ఆపేశారు.

అలాంటి ఈ సినిమా మళ్లీ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోందట. జులైలో ఈ సినిమా షూటింగును మళ్లీ మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఎదురుచూస్తున్నాము అని తన ట్విట్టర్లో అడివి శేష్ రాసుకొచ్చాడు. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ .. శోభిత ధూళిపాళ్ల ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ .. రేవతి కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. తన కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే బలమైన నమ్మకంతో అడివి శేష్ ఉన్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ సినిమాకి ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు.