తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరుల దారుణహత్య

19-06-2021 Sat 16:44
  • రాయలసీమలో పడగ విప్పుతున్న ఫ్యాక్షన్ భూతం
  • శింగనమల నియోజకవర్గంలో పెద్దారెడ్డి అనుచరుల హత్య
  • వేట కొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు
YSRCP MLA Pedda Reddy followers murdered

రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ మళ్లీ పడగలు విప్పుతోంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పాత కక్షలు చెలరేగుతున్నాయి. కడప, కర్నూలు జిల్లాల్లో ఇటీవలే నలుగురు హత్యకు గురికాగా... ఈరోజు అనంతపురం జిల్లాలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. వీరిద్దరూ తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు కావడం గమనార్హం.

తాడిపత్రి నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం అచ్యుతాపురంలో ఈ ఇద్దరు వైసీపీ అనుచరులను హత్య చేశారు. ఒక భూవివాదానికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి, తిరిగివస్తుండగా... వేట కొడవళ్లతో వీరిని ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన అచ్యుతాపురం, వేటాపురం గ్రామాల మధ్య జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ హత్యలతో తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.