ధనుష్ సరసన మరోసారి సాయిపల్లవి?

19-06-2021 Sat 16:24
  • ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల చిత్రం 
  • తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం
  • సాయిపల్లవి కోసం మేకర్స్ ప్రయత్నాలు
  • శేఖర్ తో సాయిపల్లవికి మూడో సినిమా
Sai Pallavi opposite Dhanush again

ఒక్కోసారి కొన్ని కాంబినేషన్లు వరుసగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అది హీరో- హీరోయిన్ కావచ్చు.. హీరో-దర్శకుడు కావచ్చు.. దర్శకుడు-హీరోయిన్ కావచ్చు. అలా కంటిన్యూ కావడానికి రకరకాల కారణాలుంటాయి. ముఖ్యంగా హిట్ కాంబినేషన్ అనేదే ఇలా రిపీట్ అవుతుంటుంది.

ఇక విషయానికి వస్తే, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల- కథానాయిక సాయిపల్లవి కాంబోలో గతంలో 'ఫిదా' చిత్రం వచ్చిన సంగతి విదితమే. దీని తర్వాత వీరిద్దరి కలయికలో మళ్లీ 'లవ్ స్టోరీ' సినిమా రూపొందుతోంది. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పుడు వీరి కాంబోలో మూడో సినిమా కూడా రానున్నట్టు వార్తలొస్తున్నాయి.

ప్రముఖ తమిళ కథానాయకుడు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవిని తీసుకోవాలనే ఆలోచనను మేకర్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఆమధ్య వచ్చిన 'మారి 2' తమిళ చిత్రంలో ధనుష్ సరసన సాయిపల్లవి జతకట్టిన సంగతి తెలిసిందే.