దేశ వ్యాప్తంగా 500 ఆలయాలను నిర్మించాలని నిర్ణయించిన టీటీడీ

19-06-2021 Sat 16:08
  • 18 నెలల్లో కశ్మీర్ లో ఆలయ నిర్మాణం పూర్తి
  • కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు కొత్త విధానం
  • శ్రీవారికి ప్రకృతి వ్యవసాయ ధాన్యంతో నైవేద్యం
TTD decided to construct 500 temples

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. సమావేశానంతరం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, 18 నెలల్లో కశ్మీర్ లో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ప్రతి గుడిలో ఓ గోమాతను ఉంచుతామని తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని దాదాపు 100 గుళ్లలో అమలు చేస్తున్నట్టు చెప్పారు.

టీటీడీ పరిధిలో అన్ని విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. 90 రోజుల్లో దీనికి సంబంధించిన ముసాయిదాను తీసుకురాబోతున్నామని చెప్పారు. అవకాశం ఉన్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగిని శాశ్వత ప్రాతపదికన నియమిస్తామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ధాన్యంతో స్వామివారికి నైవేద్యం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సహజ పంటలపై అన్ని జిల్లాలకు చెందిన రైతులతో త్వరలోనే చర్చిస్తామని తెలిపారు.