చాలా ఎగ్జైటింగ్ గా ఉందంటున్న ధనుశ్!

19-06-2021 Sat 13:55
  • తమిళంలో విపరీతమైన క్రేజ్
  • తెలుగులో తొలి సినిమాకి సన్నాహాలు
  • శేఖర్ కమ్ముల కొత్త ప్రయోగం
  • త్వరలోనే మిగతా వివరాలు
Dhanush is excited to do with Sekhar kammula

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'లవ్ స్టోరీ' విడుదలకు ముస్తాబవుతోంది. థియేటర్లు తెరుచుకున్న వెంటనే ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే శేఖర్ కమ్ముల తదుపరి సినిమా ఏ హీరోతో ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ఫలానా హీరోతో ఉండనుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. వాటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ, శేఖర్ కమ్ముల తదుపరి సినిమా ధనుశ్ తో ఉండనుందంటూ ఒక ప్రకటన అధికారికంగా వచ్చేసింది.

ఈ కాంబినేషన్ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ధనుశ్ తో శేఖర్ కమ్ముల సినిమా చేయనుండటం .. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుండటం మరింత విస్మయులను చేసింది. ఈ నేపథ్యంలో .. ధనుశ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో .. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు నిర్మాణంలో కలిసి పనిచేయబోతున్నందుకు తనకి చాలా ఎగ్జైటింగ్ గా ఉందని అన్నాడు. ధనుశ్ చేస్తున్న తొలి తెలుగు సినిమా కావడంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగిపోతున్నాయి. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.