తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జగన్‌పై విరుచుకుపడిన గోనె ప్రకాశ్ రావు

19-06-2021 Sat 08:35
  • జగన్ బెయిలు రద్దవుతుంది
  • సంక్షేమం, అభివృద్ధిలో జగన్ విఫలం
  • సవాలు విసిరారనే తిరుపతిలో సమావేశం
  • విజయమ్మ రాసిన ‘నాలో నాతో వైఎస్సార్’ అబద్ధాల పుట్ట
Ex MLA Gone Prakash Rao Press Meet in Tirupati press club

చిత్తూరు జిల్లా తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిన్న మీడియాతో మాట్లాడిన ఏపీఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాకుండా దమ్ముంటే ఏపీలో విలేకరుల సమావేశం నిర్వహించాలన్న వైఎస్, జగన్ ఎన్నారై అభిమానుల సవాలును స్వీకరించి ఇక్కడ మాట్లాడుతున్నట్టు చెప్పిన ప్రకాశ్‌రావు.. కడప జిల్లాలోనైనా మాట్లాడేందుకు తాను సిద్దమన్నారు.  

సంక్షేమం, అభివృద్ధి విషయంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. జగన్ బెయిలు కచ్చితంగా రద్దవుతుందని జోస్యం చెప్పారు. జగన్ అసలు రూపాన్ని బయటపెడతానని హెచ్చరించారు. బీజేపీ అనుకుంటే జగన్, కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజద్రోహం చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఎలా అమలు చేస్తోందని ప్రశ్నించారు. ఏపీలో ఇప్పటి వరకు ఆ చట్టాన్ని ఉపయోగించిన దాఖలాలు లేవన్నారు.

వైసీపీ గౌరవాధ్యక్షురాలి హోదాలో ఉన్న విజయమ్మ తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలకు ఎలా మద్దతు ఇస్తారని గోనె ప్రశ్నించారు. మరి ఈ విషయంలో విజయమ్మకు షోకాజ్ నోటీసు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  విజయమ్మ రాసిన ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకం అవాస్తవాల పుట్ట అని ఆరోపించారు. వైఎస్ పాదయాత్రలో జగన్ ఉన్నారని పుస్తకంలో రాయడమే అందుకు నిదర్శనమని అన్నారు. అంతేకాదు, వైఎస్ పాదయాత్రలో జగన్ కూడా వున్నారని అంబటి రాంబాబు, భూమన కరుణాకర్‌రెడ్డి, లగడపాటి రాజగోపాల్‌లలో ఏ ఒక్కరు నిరూపించినా తాను ఉరేసుకుంటానని గోనె ప్రకాశ్‌రావు సవాలు విసిరారు.