'భీష్మ' దర్శకుడికి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్!

18-06-2021 Fri 18:21
  • 'గని' షూటింగులో బిజీగా వరుణ్ తేజ్
  • సెట్స్ పైకి వెళుతున్న 'ఎఫ్ 3'
  • చరణ్ విన్న కథ వరుణ్ దగ్గరికి
Varun Tej in Venky Kudumula movie

వరుణ్ తేజ్ వరుస హిట్లతో దూసుకుపోతున్న సమయంలో కరోనా కాలు పెట్టింది. దాంతో ఆయన దూకుడుకు కళ్లెం వేసినట్టు అయింది. కరోనా కారణంగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' సినిమాను వెంటనే పట్టాలెక్కించలేకపోయాడు. ఇక ఇదే కారణంగా 'ఎఫ్ 3' సినిమా కూడా సెట్స్ పై ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆయన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ కోసమే వెంకీ కుడుముల వెయిట్ చేస్తున్నట్టు చెప్పుకున్నారు.

తాజాగా వరుణ్ తేజ్ నుంచి వెంకీ కుడుములకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా చెబుతున్నారు. 'ఛలో' .. 'భీష్మ' సినిమాల భారీ విజయాలతో దర్శకుడిగా తానేమిటనేది వెంకీ కుడుముల నిరూపించుకున్నాడు. ఆ తరువాత సినిమాను చరణ్ తో చేయాలనే ఉద్దేశంతో ఆయనకి కథను వినిపించాడు. ఈ కథ తనకంటే వరుణ్ తేజ్ కి బాగా సెట్ అవుతుందని చెప్పి, చరణ్ ఆయన దగ్గరికి పంపించాడట. అలా వరుణ్ తేజ్ దగ్గరికి వెళ్లిన ప్రాజెక్టు ఇప్పుడు సెట్ అయిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు.