దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్!

18-06-2021 Fri 18:18
  • మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి ఆత్మహత్య
  • పరామర్శించేందుకు వెళ్లిన రఘునందన్ రావు
  • సమాజం తలదించుకునేలా కేసీఆర్ పాలన ఉందన్న రఘునందన్
BJP MLA Raghunandan Rao arrested

తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరపున రఘునందన్ రావు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈరోజు రఘునందన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రఘునందన్ రావు వెళ్లారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ, మల్లారెడ్డి ఆత్మహత్య విచారకరమని, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అరెస్ట్ చేయడం దురదృష్టకరమని అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై మాట్లాడేవారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.