అదే తప్పు మీరు చేస్తే రైటవుతుందా?: విజయశాంతి

18-06-2021 Fri 17:35
  • టీఆర్ఎస్ సర్కారుపై విజయశాంతి ధ్వజం
  • భూములు అమ్మేస్తున్నారని వ్యాఖ్యలు
  • రాష్ట్రాన్ని ప్రయివేటీకరిస్తున్నారంటూ ఆగ్రహం
  • విద్యావ్యవస్థ సైతం గాడితప్పిందని విమర్శలు 
  • ప్రభుత్వం కూలితే కానీ మంచిరోజులు రావని వెల్లడి
Vijayasanthi take dig at Telangana govt

బీజేపీ మహిళా నేత విజయశాంతి టీఆర్ఎస్ సర్కారుపై మరోసారి తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణలో కీలక వ్యవస్థలు ఎంత దారుణంగా కుప్పకూలాయో అర్థం కావాలంటే నేటి పత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తే చాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో భూములను అమ్మేసి ఏ విధంగానైనా వేల కోట్ల రూపాయల ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం ఉరకలు వేస్తోందని విమర్శించారు.

ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేసిన సీఎం కేసీఆర్... నేడు రాష్ట్రంలో భావితరాల కోసం సర్కారు భూమి అన్నదే లేకుండా చేయడానికి కుట్రకు పాల్పడుతున్నారని  ఆరోపించారు.  
అత్యంత కీలక భూములను పెద్దమొత్తంలో అమ్మేసి రాష్ట్రాన్ని ప్రయివేటీకరించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని విజయశాంతి విమర్శించారు.

"గత ప్రభుత్వాలు భూములు అమ్మితే లేని తప్పు మేం అమ్మితే వచ్చిందా? అని హరీశ్ రావు అంటున్నారు. కానీ ఆనాటి ప్రభుత్వాలు చేసిన తప్పును అన్ని వర్గాలు ఖండించాయి. అదే తప్పు మీరు చేస్తే రైటవుతుందా?" అని ప్రశ్నించారు.

ఈ అవకతవక రెవెన్యూ విధానాలతో పాటు రాష్ట్రంలో కుప్పకూలుతున్న మరో వ్యవస్థ ఉన్నత విద్యారంగం అని తెలిపారు. మొన్నటివరకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వీసీలు లేక వ్యవస్థ గాడి తప్పిందని పేర్కొన్నారు. ఈ విషయంలో గవర్నర్ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటుగా లేఖ రాసే పరిస్థితి వచ్చిందని విజయశాంతి వివరించారు.

ప్రొఫెసర్ల కొరత వర్సిటీలను తీవ్రంగా వేధిస్తోందని, దాదాపు 2,152 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటేనే ఈ ప్రభుత్వం విద్యావ్యవస్థను ఎంత దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. 1000 పైచిలుకు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నాలుగేళ్ల కిందటే నిర్ణయం తీసుకున్నా, ఇప్పటివరకు భర్తీ చేయలేదని ఆరోపించారు. వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వం కుప్పకూలితే కానీ మంచి రోజులు రావని వ్యాఖ్యానించారు.