భారీ చారిత్రక చిత్రంగా 'మరక్కర్' .. రిలీజ్ డేట్ ఖరారు!

18-06-2021 Fri 17:05
  • మోహన్ లాల్ నుంచి చారిత్రక చిత్రం
  • దర్శకుడిగా ప్రియదర్శన్
  • భారీ తారాగణంతో రూపొందిన సినిమా
  • ఆగస్టు 12వ తేదీన విడుదల  
Marakkar Malayala movie release date is fixed

మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో 'మరక్కర్' అనే సినిమా రూపొందింది. కేరళ తీరప్రాంతాన్ని ఆక్రమించడానికి పోర్చుగీసువారు ప్రయత్నించినప్పుడు వారిని ఎదిరించిన 'కుంజలి మరక్కర్' అనే యోధుడి కథ ఇది. అత్యధిక భారీ బడ్జెట్ తో .. అంటే 100 కోట్ల బడ్జెట్ తో ఆంటోని పెరంబవూర్ ఈ సినిమాను నిర్మించారు. ప్రియదర్శన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సినిమాను క్రితం ఏడాదిలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వీలుపడలేదు.

ఈ సినిమాను 'ఓనమ్' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా వదిలారు. సునీల్ శెట్టి .. యాక్షన్ కింగ్ అర్జున్ .. ప్రభు .. కీలకమైన పాత్రలను పోషించారు. ఇక ముఖ్యమైన పాత్రల్లో కీర్తి సురేశ్ .. మంజు వారియర్ .. సుహాసిని .. కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ కూడా ఈ సినిమాలో నటించడం విశేషం. ఈ సినిమా సృష్టించనున్న సంచలనం గురించే మోహన్ లాల్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.