Job Calendar: ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చెబుతున్నది అంకెల గారడీనే: యనమల

  • ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ సర్కారు
  • యనమల విమర్శనాస్త్రాలు 
  • ఇంటికో ఉద్యోగమని మాట తప్పారని వెల్లడి
  • కోటి మంది ఉపాధి పోగొట్టారని ఆగ్రహం
Yanamal comments on AP Govt job calendar

ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలతో కూడిన ఉద్యోగ కాలెండర్ విడుదల చేయడం పట్ల టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శనాస్త్రాలు సంధించారు. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చెబుతున్నది అంకెల గారడీనే అని స్పష్టం చేశారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి మాట తప్పారని, తద్వారా కోటి మందికి ఉపాధి పోగొట్టారని ఆరోపించారు. ఉద్యోగ నియామకాలపై పారదర్శకత ఉంటే ఫోన్ నెంబర్లు, వివరాలు వెబ్ సైట్లో పెట్టాలని అన్నారు.

15 రోజుల క్రితం 4.77 లక్షల ఉద్యోగాలిచ్చినట్టు చెప్పుకున్నారని... ఇప్పుడు 6.03 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారని పేర్కొన్నారు. ఈ పక్షం రోజుల్లోనే 1.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారా? అని యనమల ప్రశ్నించారు. రాష్ట్రంలో 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 10 వేల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులుపుకుంటారా? అని నిలదీశారు.

ఆర్టీసీలో పనిచేసే 50 వేల మందిని విలీనం చేసి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్టు బోగస్ లెక్కలు చూపుతున్నారని ఆరోపించారు. కొవిడ్ సమయంలో 3 నెలల కోసం తీసుకున్న 26 వేల మందిని కూడా ఉద్యోగులుగా చూపడం హాస్యాస్పదంగా ఉందని యనమల విమర్శించారు.

More Telugu News