అల్కజార్... హ్యుండాయ్ నుంచి భారత మార్కెట్లోకి సరికొత్త ఎస్ యూవీ

18-06-2021 Fri 15:11
  • 3 వేరియంట్లలో విడుదల
  • ప్రారంభ ధర రూ.16.3 లక్షలు
  • హై ఎండ్ మోడల్ ధర రూ.20 లక్షలు
  • డీజిల్ తో 20.4 కిమీ మైలేజి ఇస్తుందన్న కంపెనీ
Hyundai Alcazar released in Indian market

భారత రోడ్లపై మరో సరికొత్త ఎస్ యూవీ పరుగులు తీయనుంది. కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుండాయ్ లేటెస్ట్ గా అల్కజార్ మోడల్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది ప్రధానంగా 3 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ప్రెస్టీజ్, ప్రీమియం, సిగ్నేచర్ వేరియంట్లలో వస్తున్న అల్కజార్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో లభించనుంది. ఇక ఫీచర్లను బట్టి ఈ 3 వేరియంట్లలో 12 సబ్ వేరియంట్లు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.16.3 లక్షలు కాగా, హై ఎండ్ మోడల్ రూ.20 లక్షలు. ఇవి ఎక్స్ షోరూం ధరలు.

అల్కజార్ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 14.5 కిమీ, డీజిల్ వెర్షన్ లీటరుకు 20.4 కిమీ మైలేజీ ఇస్తుందని హ్యుండాయ్ వర్గాలు వెల్లడించాయి. ఈ నయా మోడళ్లు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ (ఆప్షనల్) ట్రాన్స్ మిషన్ లతో లభ్యమవుతాయి. హ్యుండాయ్ అల్కజార్ ఎస్ యూవీ సెగ్మెంట్లో ప్రధానంగా టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్ యూవీ-700, ఎంజీ హెక్టర్ ప్లస్ లకు గట్టి పోటీ ఇస్తుందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.