వైఎస్ పాదయాత్రలో ఉన్నది వీళ్లే... జగన్ ఎక్కడా లేడు: గోనె ప్రకాశ్ రావు

18-06-2021 Fri 14:20
  • వైఎస్ పై పుస్తకం రాసిన విజయమ్మ
  • ఆ పుస్తకంలో తప్పులు ఉన్నాయన్న గోనె
  • వైఎస్ పాదయాత్రలో జగన్ పాల్గొన్నట్టు రాశారని వెల్లడి
  • అది నిజమని నిరూపిస్తే ఉరేసుకుంటానని సవాల్
Gone Prakash Rao sensational comments on YS Jagan

తెలంగాణ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు తీవ్రవ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అర్ధాంగి విజయమ్మ రాసిన పుస్తకంలో తప్పులు ఉన్నాయని అన్నారు. వైఎస్ పాదయాత్రలో జగన్ కూడా ఉన్నారని విజయమ్మ పేర్కొన్నారని, అది అబద్ధం అని గోనె ప్రకాశ్ రావు ఆరోపించారు.

 నాడు వైఎస్ పాదయాత్ర చేసిన సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు, సుధీర్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ ఉన్నారని వెల్లడించారు. వైఎస్సార్ పాదయాత్రలో జగన్ లేరని స్పష్టం చేశారు. ఒకవేళ నాటి పాదయాత్రలో జగన్ కూడా ఉన్నాడని నిరూపిస్తే ఉరేసుకోవడానికైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు.

ఇక బీజేపీ తలుచుకుంటే జగన్, కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని గోనె అభిప్రాయపడ్డారు. జగన్ బెయిల్ రద్దు అవుతుందంటూ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, అదే నిజమైతే జగన్ జైలుకు కాక ఇంకెక్కడికి వెళతాడు? అని ప్రశ్నించారు. అటు కేసీఆర్ పైనా రెండు ఈడీ కేసులు ఉన్నాయని వివరించారు. తన జోలికి వస్తే ఎవరి బండారం బట్టబయలు చేయడానికైనా వెనుకాడబోనని ఆయన స్పష్టం చేశారు.