West Bengal: మమత మేనల్లుడిని చెంప దెబ్బ కొటిన వ్యక్తి అనుమానాస్పద మృతి

Man Who Slapped Mamata Nephew Died Mysterious Circumstances
  • ఆసుపత్రి వద్ద వదిలేసి వెళ్లిన వ్యక్తులు
  • తీవ్రగాయాలతో చికిత్స
  • కొద్ది గంటలకే కన్నుమూత
  • ముమ్మాటికీ హత్యేనంటున్న కుటుంబ సభ్యులు
2015లో మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని చెంప దెబ్బ కొట్టిన వ్యక్తి ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. తీవ్ర గాయాలతో ఉన్న దేవాశీష్ ఆచార్య అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం మిడ్నాపూర్ లోని తామ్లూక్ జిల్లా ఆసుపత్రిలో వదిలేసివెళ్లిపోయారు. ఆసుపత్రి రికార్డుల ప్రకారం తెల్లవారుజామున 4 గంటలకు అతడిని ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు సిబ్బంది చెబుతున్నారు.

అయితే, అదే రోజు మధ్యాహ్నం కల్లా ఆశీష్ చనిపోయాడని తెలిపారు. ఇది ముమ్మాటికే హత్యేనని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. గత ఏడాది దేవాశీష్  బీజేపీలో చేరాడని చెప్పారు. అందుకే చంపేశారని వారు ఆరోపించారు. ఇద్దరు స్నేహితులతో కలిసి జూన్ 16న దేవాశీష్ బయటకు వెళ్లాడని, బైకుపై వెళ్లిన ఆ ముగ్గురు సోనాపేట టోల్ ప్లాజా దగ్గర టీ స్టాల్ వద్ద ఆగారని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఫోన్ రావడంతో దేవాశీష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందన్న దానిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మృతిపై అనుమానాలు..

2015లో అభిషేక్ బెనర్జీని చెంప దెబ్బ కొట్టి దేవాశీష్ వార్తల్లోకెక్కాడు. అప్పుడే టీఎంసీ కార్యకర్తలు అతడిని చితకబాది, పోలీసులకు అప్పగించారు. అయితే, అతడి మానసిక పరిస్థితి బాగాలేదని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. అరెస్ట్ చేయొద్దని పోలీసులకు అభిషేక్ సూచించారు.

అయితే, అతడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దేవాశీష్ పై దాడి చేసిన తృణమూల్ కార్యకర్తలపైనా కేసులు పెట్టినా అంత తీవ్రత లేని సెక్షన్ల కిందే బుక్ చేశారు. టీఎంసీలోని కొందరు పెద్దలు, కార్యకర్తలు మాత్రం దేవాశీష్ కు సరైన బుద్ధే చెప్పామని అప్పట్లో కామెంట్ చేశారు.

ఇప్పుడు దేవాశీష్ అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో ఇది ముమ్మాటికే హత్యేనని అతడి కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కేసును సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
West Bengal
Mamata Banerjee
Devashish Acharya
Crime News
Abhishek Banerjee

More Telugu News