వ్యాక్సిన్ అందకపోవడానికి మోదీ ప్రభుత్వమే కారణం: రోజా

18-06-2021 Fri 12:37
  • టీడీపీ, బీజేపీ నేతలు హైదరాబాదులో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు
  • వ్యాక్సిన్ల కోసం చంద్రబాబు కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదు
  • బీజేపీ నేతలు కూడా కేంద్రాన్ని కోరడం లేదు
Modi Govt is responsible for lack of vaccine says Roja

టీడీపీ, బీజేపీ పార్టీలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండకుండా... హైదరాబాదులో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శించారు. ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్న జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం దారుణమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందలేదని... దీనికి మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

ఏపీకి సరిపడా వ్యాక్సిన్ పంపించాలని ప్రధాని మోదీకి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్క లేఖ కూడా రాయలేదని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా వ్యాక్సిన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న నారా లోకేశ్ పై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఆయన మాదిరే చవటలా తయారవ్వాలని లోకేశ్ కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.