ధనుశ్ హీరోగా శేఖర్ కమ్ముల సినిమా ఖరారు!

18-06-2021 Fri 12:30
  • ధనుశ్ నుంచి త్రిభాషా చిత్రం
  • దర్శకుడిగా శేఖర్ కమ్ముల
  • నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన
  • త్వరలో మిగతా వివరాలు  
 Dhanush in Sekhar Kammula movie

తమిళనాట విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ ధనుశ్ దూసుకెళుతున్నాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఆయన సినిమాలన్నీ కూడా వైవిధ్యభరితమైన చిత్రాలుగా ప్రశంసలను అందుకుకోవడం విశేషం. ప్రస్తుతం ఆయన సినిమాలు మూడు సెట్స్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుశ్ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే శేఖర్ కమ్ముల రూట్ వేరు .. ధనుశ్ ట్రాక్ వేరు .. అందువలన ఈ కాంబినేషన్ పై వస్తున్న వార్తలు నిజం కాకపోవచ్చని అంతా అనుకున్నారు.

కానీ నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయింది. ధనుశ్ హీరోగా ఈ సినిమా రూపొందడం నిజమేననే విషయం అధికారికంగా స్పష్టమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుశ్ హీరోగా తాము ఒక సినిమాను నిర్మిస్తున్నట్టుగా నిర్మాతలు నారాయణ దాస్  నారంగ్ .. పుష్కర్ రామ్మోహన్ రావు అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగుతోపాటు తమిళ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'లవ్ స్టోరీ' విడుదలకు ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే.