India: బైడెన్​ ను మించి మోదీ.. మన ప్రధానికే జనం పట్టం!

  • ఆదరణ ఉన్న నేతల్లో అగ్రస్థానం
  • 66 శాతం మంది ఆమోదం
  • బైడెన్ ను కోరుకున్న 53%.. ఆరో స్థానం
  • రెండో స్థానంలో ఇటలీ ప్రధాని
  • ‘మార్నింగ్ కన్సల్ట్’ సర్వేలో వెల్లడి
PM Modis approval rating at 66 percent ahead of US President Biden

ప్రపంచంలో మంచి చరిష్మా ఉన్న నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీనే అగ్రస్థానాన్ని సంపాదించారు. అగ్రదేశాధినేతలకన్నా ముందు నిలిచారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా 13 అగ్రదేశాధినేతల కన్నా ప్రధాని మోదీకే ఎక్కువ మంది పట్టం కట్టారు మరి. ‘మార్నింగ్ కన్సల్ట్’ అనే సంస్థ చేసిన సర్వేలో 66 శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీనే మళ్లీ దేశాధినేతగా కావాలని కోరుకుంటున్నారట. ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్’ పేరిట ఆ సర్వే ఫలితాలను మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది.

భారత్ లో 2,126 మందిని సర్వే చేస్తే అందులో 66 శాతం మంది.. ప్రధాని మోదీకి ఆమోదం తెలిపారు. మరో 28 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే, ఏడాదిలో ఈ స్కోరు పడిపోయిందని పేర్కొంది. జమ్మూకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి హోదా కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేసిన ఆగస్టు 2019లో ఆయన్ను 82 శాతం మంది ఆమోదించారని వెల్లడించింది. అప్పట్లో కేవలం 11 శాతం మందే మోదీని వ్యతిరేకించారంది. ఇప్పుడు జన ఆమోదం 16 శాతం పడిపోయింది.

ఇక, 65 శాతం మంది ఆమోదంతో మోదీ తర్వాతి స్థానంలో ఇటలీ ప్రధాని మారియో ద్రాఘీ ఉన్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో ఉన్నారు. ఆయన్ను 53 శాతం మంది ఎంచుకున్నారు. మూడో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రూస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ (63%) ఉన్నారు.

ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ (54%), జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ (53%), కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడూ (48%), బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (44%), దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ (37%), స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ (36%), బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (35%), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ (35%), జపాన్ ప్రధాని యోషిహిదే సూగా (29%) ఉన్నారు. వారం రోజుల సగటు ఆధారంగా ఈ సర్వే ఫలితాలను వెల్లడించినట్టు మార్నింగ్ కన్సల్ట్ పేర్కొంది. సర్వేను ఆన్ లైన్ లో చేసినట్టు తెలిపింది.

More Telugu News