దొడ్డి దారిన రాజ్యసభకు వెళ్లిన చరిత్ర విజయసాయిరెడ్డిది.. అశోక్ గజపతిరాజు ఒక మేరు పర్వతం: టీడీపీ ఎమ్మెల్సీ మంతెన

18-06-2021 Fri 11:00
  • వేల కోట్ల రూపాయలను దోచుకున్న చరిత్ర విజయసాయిది
  • పద్ధతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదు
  • హైకోర్టు ఉత్తర్వులను కించపరిచేలా వెల్లంపల్లి మాట్లాడుతున్నారు
Manthen Satyanarayana Raju fires on Vijayasai Reddy

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మండిపడ్డారు. అశోక్ రాజుపై విజయసాయి చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని... 'దొంగే... దొంగా దొంగా' అని అరిచినట్టున్నాయని ఎద్దేవా చేశారు. అశోక్ గజపతిరాజు ఒక మేరు పర్వతమని... విజయసాయిరెడ్డి ఒక అవినీతి అనకొండ అని దుయ్యబట్టారు.

వేల కోట్ల రూపాయలను దోచుకున్న చరిత్ర విజయసాయిదని... రాష్ట్రం కోసం కేంద్ర మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసిన చరిత్ర అశోక్ రాజుదని మంతెన అన్నారు. ప్రజల కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులను త్యాగం చేసిన చరిత్ర అశోక్ గజపతిరాజుదని... వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుని జైలుకెళ్లిన చరిత్ర విజయసాయిదని మండిపడ్డారు. విజయసాయి ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోవాలని... లేకపోతే ప్రజాకోర్టుతో పాటు, భగవంతుని కోర్టులో కూడా శిక్ష తప్పదని అన్నారు.

ఇదే సమయంలో ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లిపై మంతెన విమర్శలు గుప్పించారు. వెల్లంపల్లి వార్డు మెంబర్ కు ఎక్కువ, కౌన్సిలర్ కు తక్కువ అని ఎద్దేవా చేశారు. హైకోర్టు ఉత్తర్వులను కూడా కించపరిచేలా వెల్లంపల్లి మాట్లాడుతున్నారని అన్నారు. 166 సార్లు కోర్టుతో మొట్టికాయలు తిన్న వారికి కోర్టు ఉత్తర్వులు కోపం తెప్పించడం సహజమేనని వ్యాఖ్యానించారు. సింహాచలం అప్పన్న భూములను కాజేయడానికి మాస్టర్ ప్లాన్ వేశారని... అయితే ఆ ప్లాన్లు విఫలం కావడంతో అశోక్ గజపతిరాజుపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.