బీజేపీలో చేరిన వెంట‌నే ఈట‌ల ప‌త‌నం ప్రారంభం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి

18-06-2021 Fri 10:44
  • ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని ఈట‌ల ఢిల్లీలో తాక‌ట్టు పెట్టారు
  • ఆ వ్య‌క్తి ఆత్మ‌గౌర‌వం గురించి మాట్లాడుతున్నారు
  • హుజూరాబాద్‌లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీఆర్ఎస్‌ను గెలిపిస్తాయి
challa darmareddy slams etela

తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజీనామా చేయ‌డంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక త‌ప్ప‌నిస‌రి అయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్, ఈట‌ల మ‌ద్ద‌తుదారులు ఈ నియోజ‌క వ‌ర్గంలో త‌మ బ‌లాన్ని మ‌రింత పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

చ‌ల్లా ధ‌ర్మారెడ్డి నేతృత్వంలో క‌మ‌లాపూర్ మండ‌లంలోని ఉప్ప‌ల్‌లో  టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం జ‌రిగింది. ఇందులో ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో చేరిన వెంట‌నే ఈట‌ల ప‌త‌నం ప్రారంభ‌మైంద‌ని చెప్పుకొచ్చారు. హుజూరాబాద్  ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని ఈట‌ల ఢిల్లీలో తాక‌ట్టు పెట్టార‌ని, అటువంటి వ్య‌క్తి ఆత్మ‌గౌర‌వం గురించి మాట్లాడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

తెలంగాణకు బీజేపీ ద్రోహం చేయాలని చూస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. అటువంటి పార్టీలో చేరిన ఈటల హుజూరాబాద్‌లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పద‌ని ధ‌ర్మారెడ్డి అన్నారు. త‌మ‌ ప్ర‌భుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే త‌మ‌ను గెలిపిస్తాయ‌ని చెప్పారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన‌ని సంక్షేమ పథకాల‌ను కూడా త‌మ ప్ర‌భుత్వం అమలుచేస్తోంద‌ని చెప్పుకొచ్చారు.