లంచం ఇచ్చిన ఆరోపణలపై.. కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్‌ పై కేసు నమోదు

18-06-2021 Fri 10:26
  • ఎన్‌డీయే తరపున పోటీచేసేందుకు లంచం ఇచ్చినట్టు ఆరోపణలు
  • వైరల్ అయిన ఆడియో క్లిప్
  • కోర్టు ఆదేశాలతో కేసు నమోదు
  • ఇప్పటికే అలాంటి కేసు ఒకటి సురేంద్రన్‌పై నమోదు
Court tells cops to file case against Kerala BJP chief

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్‌డీయే తరపున పోటీ చేసేందుకు జనాధిపత్య రాష్ట్రీయ పార్టీ (జేఆర్‌పీ) అధ్యక్షుడు సీకే జానుకి లంచం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కేరళ చీఫ్ కె.సురేంద్రన్‌పై నిన్న కేసు నమోదైంది. లంచానికి సంబంధించి సురేంద్రన్, జేఆర్‌పీ నేత ప్రసీథ అజికోడ్‌కు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జాను తిరిగి ఎన్డీయేలోకి వచ్చి పోటీ చేసే నిమిత్తం ఆమెకు సురేంద్రన్ 10 లక్షలు చెల్లించినట్టు ఈ ఆడియో క్లిప్ ద్వారా వెల్లడైంది. ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీకే నావాస్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో, ఆయన వాయినాడు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సురేంద్రన్‌పై కేసు నమోదు చేశారు.

కాగా, సురేంద్రన్‌పై ఇప్పటికే ఇలాంటి కేసు ఒకటి నమోదైంది. తనను పోటీ నుంచి తప్పుకోవాలని బెదరించడమే కాకుండా, ఆ తర్వాత తనకు రూ. 2.5 లక్షలు లంచం ఇచ్చారంటూ మంజేశ్వరమ్ స్థానానికి బీఎస్పీ తరపున నామినేషన్ వేసిన కె.సుందర ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఈ నెల 7న సురేంద్రన్‌పై కేసు నమోదైంది.