50 కిలోల బరువుతో కదల్లేకపోతున్న శునకం.. బేరియాట్రిక్ సర్జరీ చేసిన వైద్యులు

18-06-2021 Fri 09:53
  • దేశంలోనే తొలిసారి శునకానికి బేరియాట్రిక్ సర్జరీ
  • సర్జరీ కోసం రూ. 1.20 లక్షలు ఖర్చు చేసిన యజమాని
  • ఆపరేషన్ చేసి 5 కిలోల కొవ్వును తొలగించిన వైద్యులు
Obese dog undergoes weight loss surgery in Pune

సాధారణంగా బేరియాట్రిక్ సర్జరీ అనేది స్థూలకాయంతో బాధపడుతున్న వారికి చేసి వారి శరీర బరువును తగ్గిస్తారు. కానీ దేశంలోనే తొలిసారి పూణెలో ఓ శునకానికి బేరియాట్రిక్ సర్జరీ చేశారు. నగరానికి చెందిన యాస్మిన్ దారువాలా ‘దీపిక’ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. ఇది రోజురోజుకు బరువు పెరిగిపోయి ఏకంగా 50 కిలోలకు చేరుకుంది. ఫలితంగా కిడ్నీ, కార్డియాక్, లివర్,  హై బీపీ వంటి సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో అది నడవడానికి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేది. ఆందోళన చెందిన యాస్మిన్ జంతు వైద్య నిపుణులను ఆశ్రయించారు.

‘దీపిక’ను పరీక్షించిన నిపుణులు దానికి బేరియాట్రిక్ సర్జరీ చేయించాలని సూచించారు. ఫలితంగా శునకం బరువు తగ్గి సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. దీంతో 8 ఏళ్ల 6 నెలల వయసున్న ‘దీపిక’కు రూ. 1.20 లక్షల ఖర్చుతో ల్యాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఆపరేషన్ చేయించారు. శునకానికి ఆపరేషన్ చేసిన వైద్యులు దానిలో పేరుకుపోయి 5 కిలోల అదనపు కొవ్వును తొలగించారు. ఫలితంగా శునకం బరువు 45 కిలోలకు చేరుకుంది. ‘దీపిక’ ఇప్పుడు నడవగలుగుతోందని యాస్మిన్ తెలిపారు.