‘అంబేద్కర్ మిషన్’ పేరుతో వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు: పోలీసు అధికారులపై డీజీపీకి వర్ల రామయ్య ఫిర్యాదు

18-06-2021 Fri 08:32
  • ఎస్పీ సత్తిబాబు ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు
  • సునీల్ కుమార్ ఈ దేశాన్ని కించపరిచారు
  • వీరిద్దరిపై రాజద్రోహం కేసు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకోండి
  • లేఖతోపాటు వారి ప్రసంగాలను జతచేసిన వర్ల
TDP Leader Varla Ramaiah Writes letter to DGP

అంబేద్కర్ ఇండియన్ మిషన్ (ఏఐఎం) పేరుతో వైషమ్యాలు రెచ్చగొడుతున్నారంటూ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్, ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలన్న కృష్ణా జిల్లా అదనపు ఎస్పీ మోకా సత్తిబాబుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిన్న డీజీపీకి ఫిర్యాదు చేశారు.

వీరిద్దరూ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. సునీల్ కుమార్ నేతృత్వంలో ఏఐఎం ఏర్పాటైందని పేర్కొన్న వర్ల.. ఈ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సత్తిబాబు మాట్లాడుతూ.. ట్విన్ టవర్లను కూల్చిన ఉగ్రవాదులను ఎస్సీలు ఆదర్శంగా తీసుకోవాలని, ఆత్మార్పణకు సిద్ధంగా ఉండాలని సూచించారని గుర్తు చేశారు.

ఇదే కార్యక్రమంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ.. బ్రిటిష్ వారి గురించి గొప్పగా మాట్లాడుతూ భారత సంప్రదాయాన్ని కించపరిచారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులైన వీరిద్దరూ నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడారని, వారిపై రాజద్రోహం కింద కేసులు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి రాసిన ఆ లేఖకు వారిద్దరి ప్రసంగాలను జతచేశారు.