రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగిత్యాల ఎస్సై

18-06-2021 Fri 07:57
  • వరకట్న వేధింపుల కేసులో బెయిలు ఇచ్చేందుకు లంచం డిమాండ్
  • రూ. 50 వేలు డిమాండ్ చేసి రూ. 30 వేలకు ఒప్పందం
  • ఎస్సై, అతడి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
SI And His Driver Arrested As Taking Bribe for Bail

స్టేషన్ బెయిలు ఇచ్చేందుకు రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఓ ఎస్సై రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని జగిత్యాల పట్టణంలో జరిగిందీ ఘటన. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కట్ట మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్చి 30న మెట్‌పల్లికి చెందిన బెజ్జారపు రాజేశ్‌తోపాటు మరో నలుగురిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది.

ఈ కేసులో నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై సంగమూరి శివకృష్ణ రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. చివరికి రూ. 30 వేలకు బేరం కుదరింది. ఈ విషయాన్ని నిందితుడు రాజేశ్ ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.

ఎస్సై సూచన మేరకు రాజేశ్ ఆ మొత్తాన్ని నిన్న అతడి డ్రైవర్ అయిన కడప రవికి అందిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రవితోపాటు ఎస్సై శివకృష్ణను కూడా అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. నిందితులను నేడు కోర్టులో హాజరుపరుస్తామన్నారు.