సువేందు అధికారి గెలుపును హైకోర్టులో సవాల్‌ చేసిన మమతా బెనర్జీ!

17-06-2021 Thu 22:55
  • నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగిన కీలక నేతలు
  • ఎన్నికల ఫలితాల రోజు నాటకీయ పరిణామాలు
  • 1700 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందిన సువేందు
  • తుది ఫలితాలపై దీదీ అనుమానం
Mamata challenges Suvendhus Victory in nandigram

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి స్వల్ప మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ దీదీ కోల్ కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీరిరువురు నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

మే 2న జరిగిన ఓట్ల లెక్కింపు సందర్భంగా నందిగ్రామ్‌ కౌంటింగ్‌ సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి 11 రౌండ్లలో అధికారి వెనుకంజలో ఉన్నప్పటికీ.. తర్వాత నాలుగు రౌండ్లలో ఆయన అనూహ్యంగా పుంజుకున్నారు. ఓ దశలో ఏకంగా 11 వేల ఓట్ల తేడాతో ముందంజలో కొనసాగారు.

దీనిపై దీదీ అనేక అనుమానాలు లేవనెత్తారు. కౌంటింగ్‌ సమయంలో నాలుగు గంటల పాటు సర్వర్‌ డౌన్‌ అయ్యిందని.. ఆ సమయంలో అవకతవకలు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. తాను గెలుపొందానని.. దానికి గవర్నర్‌ సైతం శుభాకాంక్షలు తెలియజేశారని పేర్కొన్నారు. కానీ, ఒక్కసారిగా ఫలితాలన్నీ తారుమారయ్యాయని వాపోయారు. రీకౌంటింగ్‌ కోరినప్పటికీ ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు.