Delhi Riots: ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన విద్యార్థుల విడుదల

  • తీహార్‌ జైలు నుంచి బయటకొచ్చిన నటాషా, దేవాంగన, అసిఫ్‌
  • 2 రోజుల క్రితమే బెయిల్‌ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు
  • బెయిల్‌ మంజూరును సుప్రీంలో సవాల్‌ చేసిన ఢిల్లీ పోలీసులు
  • బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పిన నటాషా
  • తాము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపామని వ్యాఖ్య
Students arrested in delhi Riots case released today

గత ఏడాది ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో అరెస్టయిన విద్యార్థి-కార్యకర్తలు నటాషా నర్వాల్‌, దేవాంగన కలితా, అసిఫ్‌ ఇక్భాల్‌ తన్హా ఈరోజు తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. వారికి రెండు రోజుల క్రితమే ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయినప్పటికీ విడుదలలో జాప్యం జరగడంతో వెంటనే వారిని వదిలిపెట్టాలంటూ కోర్టు నేడు సంబంధిత అధికారుల్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల్లోనే వారిని విడుదల చేయడం గమనార్హం.

ఈ సందర్భంగా దేవాంగన మాట్లాడుతూ.. తాము బెదిరింపులకు భయపడే మహిళలం కాదన్నారు. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి వచ్చిన మద్దతు వల్లే తాము ఇప్పటి వరకు నెట్టుకురాగలిగామన్నారు. తాము చేసిన నిరసన ప్రదర్శన ఉగ్రవాద చర్య కాదని.. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన నిరసనేనని వ్యాఖ్యానించారు. అణచివేసేందుకు ప్రయత్నించే కొద్దీ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలన్న ఆకాంక్ష బలపడుతుందన్నారు.

మరోవైపు నటాషా జైలులో ఉండగానే ఆమె తండ్రి మరణించారు. ఈ బాధాకరమైన విషయాన్ని ఎలా దిగమింగుకోవాలో కూడా అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, నిరసనకు మధ్య భేదాన్ని గుర్తించే విచక్షణను కోల్పోయే స్థితికి చేరుకున్నామన్నారు. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదిలావుంచితే, వీరికి బెయిల్‌ మంజూరు చేయాలన్న ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై రేపు సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఈశాన్య ఢిల్లీలో గత ఏడాది ఫిబ్రవరిలో పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టగా.. అవి కాస్తా భారీ అల్లర్లకు దారితీశాయి. దీనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు పలువురు విద్యార్థులను గత ఏడాది మే నెలలో అరెస్టు చేశారు.

More Telugu News